విషాదం.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను, నలుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పెలిపోయింది.
By Srikanth Gundamalla Published on 24 March 2024 2:23 PM IST
విషాదం.. షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను, నలుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పెలిపోయింది. ఫోన్ నుంచి మంటలు వచ్చి గదిలో వ్యాపించాయి. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర్ ప్రదేశ్ మీరట్ పరిధిలోని మోదిపురం జనతా కాలనీలో ఈ విషాద సంఘటన జరిగింది. జానీ (41) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు. భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక, నిహారిక, గోలు, కల్లు. నలుగురు చిన్నారులు పదేళ్ల లోపు వారే. కాగా.. శనివారం సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన తండ్రి ఫోన్‌లో చార్జింగ్ తక్కువగా ఉండటంతో ఫోన్ చార్జ్ పెట్టమని పిల్లలకు ఇచ్చాడు. ఇక వారు మొబైల్ చార్జర్‌ను ఎలక్ట్రిక్ బోర్డులో సరిగ్గానే పెట్టారు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దాంతో.. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అక్కడే ఉన్న కర్టెన్స్‌తో పాటు మంచానికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే ఇంట్లో మంటలు చెలరేగాయి.
మంటలు పూర్తిగా చిన్నారులను చుట్టుముట్టాయి. దాంతో.. వారు కేకలు వేస్తూ తల్లిదండ్రులను పిలవసాగారు. వారి అరుపులతో వెంటనే జానీ, బబితలు గదిలోకి వెళ్లి చిన్నారులను కాపాడుకున్నారు. వారిని కాపాడే క్రమంలో భార్యాభర్తలు కూడా గాయాలపాలయ్యారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారు వెంటనే ఈ ప్రమాదం గురించి పోలీసులకు చెప్పారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బబితకు సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు చెప్పారు.