ఘోర రోడ్డుప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 10 March 2024 11:45 AM ISTఘోర రోడ్డుప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
జౌన్‌పూర్ జిల్లా గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ కెరకట్ కూడలి వద్ద శనివారం రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో వెళ్తున్నారు. కారు జౌన్‌పూర్ నుంచి కెరకట్ వైపు మలుపు తిరగ్గానే ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారులో వెళ్తున్న తొమ్మిది మందిలో ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని సీతామర్హికి చెందిన గజధర్ శర్మ తన కుమారుడు చందన్‌శర్మ పెళ్లి కోసం అమ్మాయిని చూసేందుకు బంధువులతో కలిసి వెళ్తున్నాడు. ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న క్రమంలోనే రాత్రి కారు రోడ్డుప్రమాదానికి గురైందని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌తో పాటు మరొకరు లారీని అక్కడే వదిలిపెట్టి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇక రోడ్డుపై ధ్వంసమై నిలిచిపోయిన కారు, లారీని జేసీబీల సాయంతో పక్కకు తొలిగించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేశామనీ.. లారీ డ్రైవర్, మరో సహాయకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.