స్కూల్‌ బస్సు-కారు ఢీ, ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 10:28 AM IST
Uttar Pradesh, Road Accident, Six Dead,

 స్కూల్‌ బస్సు-కారు ఢీ, ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డుప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్కూల్‌ బస్సు, ఎస్‌యూవీ కారుని ఢీకొట్టింది. ఢిల్లీ- మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాహుల్‌ విహార్‌ సమీపంలో ఈ రెండు వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కారు డోర్లను కట్‌ చేసి డెడ్‌బాడీస్‌ను పోలీసులు బయటకు తీశారు.

స్కూల్‌ బస్సు-ఎస్‌యూవీ కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయాలపాలు అయ్యాడు. దీంతో.. బాలుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ ఢిల్లీలోని ఘాజీపూర్‌ నుంచి రాంగ్‌రూట్‌లో బస్సుని తీసుకొస్తున్నాడని.. ఇక కారు మీరట్‌ నుంచి గురుగ్రామ్‌కు వెళ్తుందని పోలీసులు తెలిపారు. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో సోమవారం కూడా ఘోర ప్రమాదం జరిగింది. ప్రతాప్‌ఘడ్‌లోని లీలాపూర్‌లో టెంపో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. లక్నో-వారణాసి రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50వేలను ఎక్స్‌గ్రేషియాగా సీఎం ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

Next Story