అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కోతి.. రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

అడవుల గుండా రోడ్లపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలంటూ హెచ్చరిక బోర్డులు ఉంటాయి.

By Srikanth Gundamalla  Published on  13 May 2024 10:07 AM GMT
uttar Pradesh, monkey,  road accident, three dead ,

అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కోతి.. రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

అడవుల గుండా రోడ్లపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలంటూ హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ జంతువు రోడ్డు దాటేందుకు వస్తుందో తెలియదు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా.. వణ్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అధికారులు పలు సూచన బోర్డులను ఏర్పాటు చేస్తారు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒక కోతి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం దోమ్‌గఢ్ ప్రాంతంలో మొరాదాబాద్-అలీగఢ్‌ జాతీయ రహదారిపైకి ఒక కోతి ఉన్నట్లుండి వచ్చింది. అదే సమయంలో రోడ్డుపై ట్యాంకర్‌ వస్తోంది. సడెన్‌గా కోతి రోడ్డుపైకి రావడంతో.. దాని నుంచి ట్యాంకర్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు డ్రైవర్. దాంతో.. అనుకోకుండా ఎదురుగా వస్తోన్న మరో కారుని ఢీకొట్టాడు. అప్పటికే ట్యాంకర్... కారు అతివేగంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురూ బ్యాంకు ఉద్యోగులుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతులను.. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్‌ సౌరభ్ శ్రీవాస్తవ, క్యాషియర్ దివ్యాన్షు, అమిత్‌గా పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఇక అమిత్‌ మాత్రం తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లామనీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి కారణం.. అకస్మాత్తుగా కోతి రోడ్డుపైకి రావడమే అని చెప్పారు. ఈ మేరకు ట్యాంకర్‌ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story