ఎనిమిదో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తైన భవనంలోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 1:30 PM ISTఎనిమిదో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తైన భవనంలోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఏకంగా 8 అంతస్తుల పైనుంచి కిందపడింది లిఫ్ట్. ఈ సంఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటిల్లో పైన ఉన్న అంతస్తులకు తేలికగా ఎక్కేందుకు ప్రతి భవనంలో లిఫ్ట్ ఉండటం కామన్ అయిపోయింది. లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా ఉండకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంఘటనల్లో జనాలు ప్రాణాలు కోల్పోతే.. ఇంకొన్ని సార్లు అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డ వారు ఉన్నారు. అయితే.. నగరాల్లో ఉండే భవనాల్లో ఆఫీస్ స్పేస్‌కు కూడా కేటాయిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నోయిడాలో కూడా ఓ భవనంలోని 8వ అంతస్తులో ఐటీ డెవలపర్ కంపెనీ ఉంది.
ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. తమ షిఫ్ట్ పూర్తయిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు బయల్దేరారు. ఎనిమిదవ ఫ్లోర్‌లో ఆఫీస్ ఉండటంతో లిఫ్ట్‌ను వినియోగిస్తుంటారు. ఈక్రమంలోనే కిందకు చేరుకునేందుకు 9 మంది ఐటీ ఉద్యోగులు లిఫ్ట్‌లో ఎక్కారు. వారు లిఫ్ట్‌లో ఎక్కిన క్షణాల్లోనే ఉన్నట్లుండి కుప్పకూలింది. 8వ అంతస్తు నుంచి కిందపడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పెద్ద శబ్ధంతో నేలకు తాకింది. దాంతో.. అలర్ట్ అయిన సెక్యూరిటీ.. ఇతర సిబ్బంది లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. లోపల ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కూడా భవనం వద్దకు చేరుకున్నారు. వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సంఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ప్రమాదంపై కేసు నమోదు చేశామని.. లిఫ్ట్ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కాగా.. ఇద్దరు లిఫ్ట్ సిబ్బందిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.