ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి ఎస్పీ షాక్
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో దూసుకెళ్తోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 5:10 AM GMTఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి ఎస్పీ షాక్
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో దూసుకెళ్తోంది. ఉత్తర్ ప్రదేశ్ అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలేలానే ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు ఎక్కువగా ఎస్పీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో బీజేపీ లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని భావించినా.. అది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీతో పోటీగా ఎస్పీ అభ్యర్థులు కూడా అధిక స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. సమాజ్ వాదీ పార్టీ 33 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక బీజేపీ అభ్యర్థులు 37 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. దీన్ని బట్టే యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటాపోటీ కనబడుతోంది. మరోవైపు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉంది. మొదటగా ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. స్వల్ప లీడ్‌లో కొనసాగుతున్నారు. వారణాసిలో ప్రధాని మోదీ వర్సెస్.. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌గా కొనసాగుతోంది. కాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాలను కూటమి అభ్యర్థులకు ఇచ్చింది. సమాజ్ వాదీ పార్టీ మాత్రం 62 లోక్‌సభ స్థానాల్లో బరిలో నిలబడింది. కాంగ్రెస్ 17, తృణమూల్ కాంగ్రెస్ ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేసింది.