యూపీలో ప్రారంభమైన తొలి విడుత పోలింగ్
Uttar Pradesh Assembly elections 2022 Phase 1 polling started.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈరోజు(గురువారం)
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2022 3:56 AM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈరోజు(గురువారం) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 623 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
శామ్లి, హాపూర్, గౌతంబుద్ధనగర్, ముజఫర్‌నగర్, మీరట్, బాఘ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కైరానా, ముజఫర్‌నగర్, థానా భవన్, సార్థానా, అత్రౌలి, నోయిడా, బాఘ్‌పట్, మధుర వంటి కీలక నియోజకవర్గాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమం అధికార బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2017లో పశ్చిమ యూపీలోని 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, ఎస్పీ 2, బీఎస్పీ 2, ఆరెల్డీ ఒక సీటును గెలుచుకున్నాయి. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో ఈ నెల14న, పంజాబ్‌లో ఈనెల 20న, మణిపూర్‌లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. అన్ని రాష్ట్రాల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.