అమృత్‌సర్‌లో ల్యాండయిన యూఎస్ అక్రమ వలసదారుల విమానం
టెక్సాస్ నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంజాబ్‌లోని అమృత్ సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
By Knakam Karthik Published on 5 Feb 2025 5:14 PM ISTఅమృత్‌సర్‌లో ల్యాండయిన యూఎస్ అక్రమ వలసదారుల విమానం
అగ్ర రాజ్యం అమెరికాలో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత నుంచే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఎయిర్ క్రాఫ్ట్ విమానం భారత్ చేరుకుంది. మొత్తం 205 మంది భారత వలసదారులు స్వదేశానికి తిరిగివచ్చినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంజాబ్‌లోని అమృత్ సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నారని.. ప్రచారం జరుగుతున్నట్లుగా 205 మంది లేరని ప్రకటించారు. వీరందరినీ అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా అక్రమ వలసదారులతో భారత్ కు వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్‌సర్‌లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం.
గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి స్వస్థలాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే తొలిదశలో 104 మందిని భారత్ కు పంపించారు. అయితే, ఇప్పుడు భారత్‌కు వచ్చిన వీరిని ప్రభుత్వం నేరస్థులుగా చూడదు. అక్రమ వలసదారులకు పాస్‌పోర్ట్‌లు అందుబాటులో లేకపోతే, బయోమెట్రిక్స్ ఉపయోగించి వారిని గుర్తించవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే..వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా భారత్ సైతం అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని చెబుతోంది. వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకువస్తామని పేర్కొంది.