రాజ్యసభలో నోట్ల కట్ట క‌ల‌క‌లం.. తెలంగాణ ఎంపీ సీటు ద‌గ్గ‌రే..

పార్లమెంట్‌లో మరోసారి నోట్ల కుంభకోణం వెలుగు చూసింది. నోట్ల కట్టలు బయటపడ్డాయన్న వార్తతో పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 11:54 AM IST
రాజ్యసభలో నోట్ల కట్ట క‌ల‌క‌లం.. తెలంగాణ ఎంపీ సీటు ద‌గ్గ‌రే..

పార్లమెంట్‌లో మరోసారి నోట్ల కుంభకోణం వెలుగు చూసింది. నోట్ల కట్టలు బయటపడ్డాయన్న వార్తతో పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. గురువారం కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి ఈ కట్టలు బయటపడ్డాయి. దీనిపై విచారణ జరపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇది సాధారణ ఘటన కాదని, సభ గౌరవంపై దాడి చేయడమేనని అన్నారు. చైర్మన్ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు కిరణ్‌ రిజిజు, పీయూష్‌ గోయల్‌లు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తుపై మాట్లాడారు.

అంతకుముందు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ మాట్లాడుతూ.. నిన్న సభ వాయిదా పడిన తర్వాత సాధారణ విచారణలో భద్రతా అధికారులు సీటు నంబర్ 222 నుండి నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నారని సభ్యులకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సీటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించబడింది. విషయం నా దృష్టికి తీసుకురాబడింది.. విచారణ జరిగిందని.. విచారణ కొనసాగుతుందని నేను నిర్ధారించానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, సభలో ఆ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే.. ఏదైనా ఒక పార్టీకి లింక్ చేయడంపై చైర్మన్‌కు ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై విచారణ జరిపినప్పుడే దోషులు ఎవరో తేలిపోతుందని.. అయితే ప్రస్తుతం ఎవరిపైనా నేరుగా నిందలు వేయడం సరికాదన్నారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ.. తాను సీటు నంబర్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చానని.. దానిని ఏ పార్టీకి లింక్ చేయలేదని చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఆరోపణలను ఖండించారు. సభలో దొరికిన డబ్బు తనది కాదని.. కేవలం రూ.500 నోటు మాత్రమే సభకు తీసుకెళ్లాన‌ని చెప్పారు.

Next Story