'అనుమతి లేకుండా నన్ను అమ్మాయిగా మార్చేశారు'.. ఆస్పత్రిపై 20 ఏళ్ల యువకుడి ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో అతని అనుమతి లేకుండానే లింగమార్పిడి కోసం ఆపరేషన్ చేయించారు

By అంజి  Published on  21 Jun 2024 6:42 AM IST
UttarPradesh, sex change operation, Muzaffarnagar

'సర్జరీ చేసి నన్ను అమ్మాయిగా మార్చేశారు'.. ఆస్పత్రిపై 20 ఏళ్ల యువకుడి ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో అతని అనుమతి లేకుండానే లింగమార్పిడి కోసం ఆపరేషన్ చేయించారు. అయితే, ఆ వ్యక్తి తన స్వంత ఇష్టానుసారం లింగమార్పిడి ప్రక్రియను చేయించుకున్నాడని ఆసుపత్రి పేర్కొంది. ఓంప్రకాష్‌ అనే వ్యక్తి తనను వేధించేవాడని 20 ఏళ్ల యువకుడు పేర్కొన్నాడు. జూన్ 3న, ఓంప్రకాష్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడ మత్తుమందు ఇచ్చి, మోసపూరితంగా ఆపరేషన్ చేయించాడని ఆ వ్యక్తి చెప్పాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసే సరికి జననాంగాలు తెగిపోయి కనిపించాయని చెప్పాడు.

"నేను నిద్ర లేచినప్పుడు, ఓంప్రకాష్ నేను ఇప్పుడు మహిళనని, నన్ను పెళ్లి చేసుకోవడానికి లక్నోకు తీసుకెళ్తానని చెప్పాడు. నేను అడ్డుకుంటే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు," అని ఆ వ్యక్తి చెప్పాడు. ఓంప్రకాష్‌తో ఆస్పత్రితో కుమ్మక్కైయ్యాడు. బాధిత వ్యక్తి తండ్రి ఫిర్యాదు మేరకు జూన్ 16న పోలీసులు ఓంప్రకాష్‌ను అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో అలసత్వం ఉందని ఆరోపిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు ఆసుపత్రి వెలుపల నిరసనకు దిగారు.

రైతు నాయకుడు శ్యామ్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో వైద్యులు అక్రమ అవయవ వ్యాపారానికి పాల్పడ్డారు. శరీరంలోని కీలకమైన అవయవాలను తొలగించి అధిక ధరకు విక్రయిస్తున్న పెద్ద రాకెట్ ఇక్కడ జరుగుతోందని ఆరోపించారు. ఆ వ్యక్తికి, అతని కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని శ్యామ్‌ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ రమాశిష్ సింగ్ మాట్లాడుతూ, "ఇక్కడ ఒక వ్యక్తికి లింగమార్పిడి కోసం ఆపరేషన్ చేసిన కేసు ఉంది. అతని కుటుంబ సభ్యులు అతన్ని మరొక వ్యక్తి తప్పుదోవ పట్టించి ఆపరేషన్ చేశారని ఆరోపించారు. సిట్- ఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. వారు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటాం అని తెలిపారు.

ఆసుపత్రి బాధితుడి దావాను తిరస్కరించింది

అయితే, తనకు మోసపూరితంగా ఆపరేషన్ చేశారన్న వ్యక్తి వాదనను ఆసుపత్రి అధికారులు ఖండించారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కీర్తి గోస్వామి ప్రకారం, ఆ వ్యక్తి ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టర్ రజా ఫరూఖీని కలవడానికి రెండు నెలలుగా క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తున్నాడు. ఆ వ్యక్తిని మహిళగా గుర్తించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తున్నట్లు గోస్వామి తెలిపారు.

అతని మానసిక స్థితిని అంచనా వేయడానికి డాక్టర్ ఫరూఖీ ఇద్దరు సైకియాట్రిస్ట్‌ల వద్దకు రిఫర్ చేసినట్లు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు, ఇది చట్టం ప్రకారం లింగమార్పిడి ఆపరేషన్‌కు ముందు అవసరం. ఇద్దరు సైకియాట్రిస్టులు మానసికంగా దృఢంగా భావించిన తర్వాతే ఆ వ్యక్తికి ఆపరేషన్ చేశారు.

"ఆ వ్యక్తి జూన్ 4న అడ్మిట్ కావడానికి ఇక్కడికి వచ్చాడు. అతని ఆపరేషన్ జూన్ 6న నిర్వహించబడింది. ఈ ప్రక్రియలన్నీ చట్టబద్ధమైనవి. డాక్టర్ ఫరూఖీ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి" అని గోస్వామి చెప్పారు. గోస్వామి తన ఆపరేషన్‌కు ముందు ఆ వ్యక్తి యొక్క వీడియో అధికారుల వద్ద ఉందని, అందులో అతను తన లింగాన్ని మార్చడానికి ఆపరేషన్ చేయించుకోవడం గురించి మాట్లాడటం చూడవచ్చు.

Next Story