నకిలీ మార్క్‌షీట్.. బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
UP BJP MLA Gets 5 Years In Jail.కాలేజీలో అడ్మిషన్ పొందడానికి నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఓ బీజేపీ
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2021 10:09 AM ISTకాలేజీలో అడ్మిషన్ పొందడానికి నకిలీ మార్క్ షీట్‌ను సమర్పించిన కేసులో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.8వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ తివారీని కోర్టు దోషిగా తేల్చింది. గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తివారి 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి పై తరగతిలో ప్రవేశం పొందారు. దీనిపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ 1992లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 28 ఏళ్ల సుధీర్ఘకాలం పాటు సాగిన ఈ కేసులో కోర్టు నిన్న ఆయన్ను దోషిగా తేల్చింది. ఐదేళ్ల శిక్ష విధించడంతో పాటు రూ.8వేల జరిమానా విధించింది. పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తివారి 1990లో నకిలీ మార్క్ షీట్ సమర్పించి అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాలలో చేరారు. ఈ విషయాన్ని 1992లో ఆ కళాశాల ప్రిన్సిపాల్ యదువంశ్ రామ్ త్రిపాఠి గుర్తించారు. ఈ విషయంపై ఆయన రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. దాదాపు 13 సంవత్సరాల తరువాత చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చాలా ముఖ్యమైన పత్రాలు రికార్డుల నుంచి అదృశ్యమయ్యాయి. ద్వితియ పత్రాల ఆధారంగా కోర్టు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో ఫిర్యాదు దారుడు త్రిపాఠి మరణించారు. అప్పటి సాకేత్ కళాశాల డీన్ మహేంద్రకుమార్ అగర్వాల్ తో పాటు మరికొంత మంది సాక్ష్యుల ఆధారంగా కోర్టు తివారిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.