రాజ‌స్థాన్‌లో వింత శిశువు జ‌న‌నం.. రెండు గుండెలు.. నాలుగు కాళ్లు, చేతులు

రాజ‌స్థాన్ లో వింత శిశువు జ‌న్మించింది. రెండు గుండెలు,నాలుగు చేతులు, నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన ఆ శిశువు 20 నిమిషాల్లోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 3:39 AM GMT
Rajasthan, Unique Baby

న‌వ‌జాత శిశువు ప్ర‌తీకాత్మ‌క చిత్రం

రాజ‌స్థాన్ రాష్ట్రంలో వింత శిశువు జ‌న్మించింది. రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్ల‌తో జ‌న్మించిన ఆ శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే మ‌ర‌ణించింది. చురు జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

రతన్‌గఢ్‌లో రాజల్‌దేసర్‌లో హ‌జారీ సింగ్ అనే మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఆమె నిండు గ‌ర్భిణీ. పురిటి నొప్పులు రావ‌డంతో ఆదివారం రాత్రి ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించారు. అందులో వైద్యుల‌కు వింత శిశువు క‌నిపించింది.

డాక్టర్ కైలాష్ సొంగరా మాట్లాడుతూ.. హ‌జారీ సింగ్ ఆస్ప‌త్రిలో చేరిన గంట‌కే నార్మ‌ల్ డెలివ‌రీ చేసిన‌ట్లు చెప్పారు. న‌వజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా రెండు గుండెలు, వెన్నెముక‌లు ఉన్నాయి. అయితే.. పుట్టిన 20 నిమిషాల‌కే శిశువు మృతి చెందింది. ప్ర‌స్తుతం మ‌హిళ ఆరోగ్యంగానే ఉంది అని తెలిపారు.

క్రోమోజోమ్‌ల లోపం కార‌ణంగానే ఇలాంటి శిశువులు జ‌న్మిస్తార‌ని వైద్యులు చెబుతున్నారు. కాగా..2022 డిసెంబరులో ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టింది. అయితే ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉంది.

Next Story