రూ.10 కాయిన్‌లు చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Union Minister Pankaj Chaudhary Clarity on 10 rupee coins validity.దేశంలో రూ.10 నాణేలు వాడుకలో ఉన్నాయా
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2022 6:25 AM GMTదేశంలో రూ.10 నాణేలు వాడుకలో ఉన్నాయా అన్నది చాలా మంది మదిలో ప్రశ్నగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. చాలా మంది వ్యాపారులు రూ.10 నాణేలను తీసుకోవడం లేదు. ఇవి వాడుకలో ఉన్నాయని చెప్పినా.. ఏమో మాకు తెలీదు.. మా దగ్గర నుంచి ఎవరూ తీసుకోవడం లేదు. అందుకనే మేము తీసుకోవడం లేదు అనే వ్యాపారులు చెప్పే సమాధానం వినబడుతోంది. కాగా.. ఈ విషయమై మంగళవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. రూ.10 నాణేం చెల్లుబాటు అవుతుందా..? నాణేలు నకిలీవన్న ఉద్దేశంలో చెల్లబాటు కావడం లేదా..? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా..? అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యుడు ఎ.విజయకుమార్ ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇలా సమాధానం ఇచ్చారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ రూ.10 నాణేలు వివిధ సైజులు, ఇతి వృత్తాలు, డిజైన్లలో ముద్రిస్తోందన్నారు. అవన్నీ కూడా చెల్లుబాటులో ఉన్నాయన్నారు. అన్నీ రకాల లావాదేవీలకు వాటిని వాడుకోవచ్చునన్నారు. అయితే.. కొంతమంది సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందువల్ల ప్రజల్లో ఉన్న అపోహలను, అనుమాలను నివృత్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా రూ.10 నాణేలను స్వీకరించకపోతే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.