'మీ కూతుళ్లను తాగుబోతులకు ఇచ్చి పెళ్లి చేయకండి'.. కేంద్రమంత్రి ఎమోషనల్
Union Minister Kaushal Kishore's emotional plea on alcoholism. మద్యానికి బానిసైన అధికారి కంటే రిక్షా పుల్లర్ లేదా కూలీ.. పెళ్లి కొడుకుగా మంచి ఎంపిక
By అంజి
మద్యానికి బానిసైన అధికారి కంటే రిక్షా పుల్లర్ లేదా కూలీ.. పెళ్లి కొడుకుగా మంచి ఎంపిక అని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. తమ కుమార్తెలను, సోదరీమణులను మద్యానికి బానిసైన వారికి ఇచ్చి పెళ్లి చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన డి-అడిక్షన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషోర్ ప్రసంగించారు. "మద్యానికి బానిసలయ్యే వ్యక్తుల జీవితకాలం చాలా తక్కువ" అని అన్నారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ.. ''నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యేగా మా కుమారుడి ప్రాణాలను కాపాడలేనప్పుడు, సామాన్య ప్రజానీకం ఎలా కాపాడుతారు'' అని అన్నారు. ''నా కొడుకు (ఆకాష్ కిషోర్) తన స్నేహితులతో కలిసి మద్యం సేవించే అలవాటు కలిగి ఉన్నాడు. అతన్ని డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చారు. ఆ చెడు అలవాటు మానుకుంటానని భావించి ఆరు నెలలకే పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతను తన వివాహం తర్వాత మళ్లీ మద్యపానం చేయడం ప్రారంభించాడు. అది చివరికి అతని మరణానికి దారితీసింది. రెండేళ్ల క్రితం.. అక్టోబర్ 19న, ఆకాష్ మరణించినప్పుడు, అతని కుమారుడికి కేవలం రెండేళ్ల వయస్సు మాత్రమే ఉంది'' అని కేంద్ర మంత్రి అన్నారు.
కౌశల్ కిషోర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ''నేను నా కొడుకును రక్షించలేకపోయాను, దాని కారణంగా అతని భార్య వితంతువు అయ్యింది. మీ కూతుళ్లను, అక్కాచెల్లెళ్లను దీన్నుంచి కాపాడాలి. "స్వాతంత్ర్య ఉద్యమంలో 90 సంవత్సరాల కాలంలో 6.32 లక్షల మంది బ్రిటిష్ వారితో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేశారని, అయితే వ్యసనం కారణంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది మరణిస్తున్నారు''అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ కిషోర్.. 80 శాతం క్యాన్సర్ మరణాలు పొగాకు, సిగరెట్లు, 'బీడీ'ల వ్యసనానికి కారణమని చెప్పారు.