కేంద్ర మంత్రి సోదరుడికి కూడా ఆసుపత్రిలో బెడ్ దొరకడం లేదా..?

VK Singh's tweet seeking bed for Covid +ve 'brother'. తాజాగా కేంద్రమంత్రి వీకే సింగ్ తన సోదరుడికి ఆసుపత్రిలో ఓ బెడ్ ఇప్పించాలని కోరుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  19 April 2021 12:12 PM IST
VK Singh

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. చాలా రాష్ట్రాల్లో కనీసం బెడ్లు కూడా దొరకని పరిస్థితి. ఆసుపత్రుల్లో ఒకే బెడ్ మీద ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతున్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా కేంద్రమంత్రి వీకే సింగ్ తన సోదరుడికి ఆసుపత్రిలో ఓ బెడ్ ఇప్పించాలని కోరుతూ ఉన్నారు.

తన సోదరుడికి కరోనా సోకిందని, ఆసుపత్రిలో అతడికి ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేశారు వీకే సింగ్. ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. మంత్రి తన ట్వీట్‌కు ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలంటూ కేంద్రమంత్రి చేసిన ట్వీట్ వైరల్ అయింది. శివసేన నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ ఆసుపత్రిలో ఓ బెడ్ కోసం సాక్షాత్తూ ఓ మంత్రే ఇలా ట్వీట్ చేయడం ఆయన నిస్సహాయతకు అద్దం పడుతోందంటూ ట్వీట్ చేశారు.

ప్రియాంక చతుర్వేది ట్వీట్‌పై స్పందించిన వీకే సింగ్.. నిజానికి ఆయన తన సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇచ్చారు. అధికారులు వేగంగా స్పందిస్తారన్న ఉద్దేశంతోనే తాను ఆ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతోనే అలా ట్వీట్ చేసినట్టు పేర్కొన్న ఆయన వైద్య సాయం అందించాలంటూ చేసిన ట్వీట్‌ను ఆ తర్వాత తొలగించారు. అప్పటికే ట్వీట్ బాగా వైరల్ అయింది. స్క్రీన్ షాట్ తీసుకున్న కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. బయట పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.

భారతదేశంలో నిన్న‌ కొత్త‌గా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో‌ 1,44,178 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,619 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,53,821 మంది కోలుకున్నారు. 19,29,329 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు.


Next Story