తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 33ను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదంకోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే ఇప్పటి వరకు దానికి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. తెలంగాణలో 10శాతం గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని అన్నారు. అయితే, తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం లభించిన తర్వాత దీనిపై ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా వివరణ ఇచ్చారు.