ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీల కనీస వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.300గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 - 24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024 - 25) రూ.300 ఇవ్వనున్నారు. కూలీలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథఖాన్ని కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రారంభించింది.
అప్పుడు రోజూ కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఎండాకాలంలో 100 రోజుల పాటు ఉపాధి పనులు చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో కూలీలు ఉదయం, సాయంత్రం, రెండు పూటలా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. 2022లో రూ.12, 2023లో రూ.15 కూలీని పెంచుకుంటూ వచ్చారు. ఎంజీఎన్‌ఆర్ ఈజీఏ ద్వారా కూలీలకు అందజేసే సొమ్ము ఇకపై వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయనున్నారు. కూలీల ఆధార్ సంఖ్యతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేలా చేయనున్నారు.