కొచ్చిన్ యూనివర్సిటీలో ఊహించని ప్రమాదం
కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (కూశాట్) వార్షికోత్సవ కార్యక్రమం ఊహించని విషాదాన్ని నింపింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2023 1:40 PM ISTకొచ్చిన్ యూనివర్సిటీలో ఊహించని ప్రమాదం
కొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (కూశాట్) వార్షికోత్సవ కార్యక్రమం ఊహించని విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వార్షికోత్సవం సందర్భంగా కొచ్చి యూనివర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో శనివారం రాత్రి ప్రముఖ గాయని నికితా గాంధీ మ్యూజికల్ షో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. వర్షం పడటంతో విద్యార్థులు షెల్టర్ కోసం పరుగులు తీసే సమయంలో తొక్కిసలాట జరిగింది.
“కార్యక్రమానికి పాస్-హోల్డర్లకు మాత్రమే అవకాశం ఉందని చెప్పాము. కానీ ఎంట్రీ పాస్‌లు లేని విద్యార్థులు, ఇతరులు కూడా క్యాంపస్‌లోకి పెద్ద ఎత్తున వచ్చేసారు” అని కుసాట్ ఫ్యాకల్టీ సభ్యుడు చెప్పారు. ఎక్కువ మంది ఆడిటోరియంలోకి దూసుకురావడంతో కొందరు హాలుకు వెళ్లే మెట్లపై నుంచి కిందపడ్డారు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో కోజికోడ్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో సీఎం పినరయి విజయన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని కుశాట్ వైస్-ఛాన్సలర్ పీజీ శంకరన్ తెలిపారు. క్యాంపస్ విమానాశ్రయం, ఇతర ప్రధాన రహదారులకు వెళ్లే జాతీయ రహదారి వెంట ఉంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వాహనదారులు, ప్రజలు పెద్ద ఎత్తున క్యాంపస్‌కు చేరుకున్నారు" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.