అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కరోనా కారణంగా చనిపోయాడని ఈరోజు మధ్యాహ్నం నుండి వార్తలు వెలువడ్డాయి. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో కరోనాకు చికిత్స పొందుతూ చోటా రాజన్ చనిపోయాడనేది వార్తల సారాంశం. 62 సంవత్సరాల చోటా రాజన్ ఒకానొకప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడిని పట్టుకోడానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించి.. 2015లో ఇండోనేషియాలో పట్టుకున్నారు.
చోటా రాజన్ ఒకానొక సమయంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. ఆ తర్వాత విబేధాలు రావడంతో అతడికి దూరమయ్యాడు. దావూద్ ఇబ్రహీం అనుచరులు కూడా చోటా రాజన్ ను చంపేయాలని తెగ ప్రయత్నించారు కూడానూ..! ఇక చోటా రాజన్ మాత్రం తాను చాలా మంచి వాడిని అని చెప్పుకొనే వాడు. నేనొక మంచి డాన్ ను.. భారత్ కు మంచి చేశాను అని తన గురించి గొప్పగా చెప్పుకొనేవాడు. ఇక 2015లో చోటా రాజన్ ను నాటకీయ పరిణామాల మధ్య ఇండోనేషియాలో పట్టుకున్నారు.
చోటా రాజన్ తీహార్ జైలులో ఉండగా కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని ఏప్రిల్ 26న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. అయితే..ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న చోటా రాజన్ చనిపోయాడని వార్తలు వస్తున్న తరుణంలో.. అతడు చనిపోలేదని.. చికిత్స పొందుతున్నాడని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.