Ukraine Russia War: భారత్ తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ గుడ్‌న్యూస్
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు.. ఉక్రెయిన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్
By అంజి
Ukraine Russia War: భారత్ తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ గుడ్‌న్యూస్
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు.. ఉక్రెయిన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ నుంచి కీలక పరీక్షకు అనుమతించనున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీలో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా ఈ విషయాన్ని భారత్‌కు తెలియజేశారు. "భారత వైద్య విద్యార్థుల సమస్యపై, విదేశీ వైద్య విద్యార్థులను తమ నివాస దేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ పరీక్షకు ఉక్రెయిన్ అనుమతిస్తుందని ఉప విదేశాంగ మంత్రి పేర్కొన్నారు" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఝపరోవా తన భారత పర్యటనను ముగించిన సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్‌లో సుమారు 19,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. అంచనాల ప్రకారం.. సుమారు 2,000 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లారు. వారు తూర్పు యూరోపియన్ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు. ఉక్రేయిన్ అధికారుల చొరవతో.. భారతదేశంలో ఇప్పటికీ ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో చేరవచ్చు. భారతదేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ (USQE)కి హాజరయ్యే అవకాశం ఉంటుంది.
పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ (పశ్చిమ) సంజయ్ వర్మతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖిని కలిశారు. "ఝపరోవా.. తన పర్యటనలో భారతదేశంతో బలమైన, సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే ఉక్రెయిన్ కోరికను హైలైట్ చేశారు" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఝపరోవా భారత పర్యటన రెండు దేశాల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తుంది" అని మంత్రిత్వశాఖ పేర్కొంది.