త్వరలో భారత్ కు నీరవ్ మోదీ

UK Government approves extradition of Nirav Modi to India.భారత్‌ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లండ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 7:11 AM IST
త్వరలో భారత్ కు నీరవ్ మోదీ

భారత‌ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇంగ్లండ్ పారిపోయి, అక్కడ జైల్లో గా కూర్చున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి..యూకే పారిపోయిన నీరవ్ మోడీని భారత్ కు అప్పగించడానికి బ్రిటన్ అంగీకరించింది. ఈ మేరకు యూకే హోం మినిస్టర్‌ నీరవ్ మోడీని ఇండియాకు అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సీబీఐ చెప్పింది.

నిజానికి ఫిబ్రవరి నెలలోనే అక్కడి కోర్టు అతనిని స్వదేశం పంపించాలని తీర్పు ఇచ్చింది. ఇన్నాళ్ళ తరువాత ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను దాదాపు రూ. 14వేల కోట్ల మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ భారత్ తిరిగి రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. తన మానసిక స్థితి సరిగా లేదని ఒకసారి.భారత్ లో న్యాయం జరగదని ఒకసారి ఇలా ప్రతిసారి బ్రిటన్ కోర్టుకు రకరకాల విన్నపాలు చేసుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ప్రయత్నాలను బ్రిటన్ కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ విషయంలో భారత్ చూపిస్తున్న ఆధారాలు సరిపోతాయనీ, వెంటనే ఆయనను ఇండియాకు అప్పచేప్పాలనీ ఫిబ్రవరి నెలలో తీర్పు ఇచ్చింది.

తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ని నీరవ్‌ మోదీ మోసగించిన సంగతి 2018 జనవరి వెలుగుచూసింది. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అదే ఏడాది రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్సమెంట్‌ డైరెక్టరేట్‌ ఈ కేసు దర్యాప్తులో భాగంగా నీరవ్‌కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్‌ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. తాజాగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నీరవ్ మోదీని ముంబై తీసుకొచ్చిన వెంటనే అర్థర్ రోడ్ జైలులోని 12 నంబర్ బ్యారక్‌లో ఉంచుతామని ఇక్కడ అధికారులు తెలిపారు. ఈ బ్యారక్‌కు సెక్యూరిటీ అత్యంత పటిష్టంగా ఉంటుంది.


Next Story