Udhayanidhi Stalin Is Fielded From Chennai. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నాడు
By Medi Samrat Published on 12 March 2021 1:13 PM GMT
తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నాడు. అతడికి టికెట్ ఇవ్వరని.. కేవలం ప్రచారం విషయంలో మాత్రమే వాడుకుంటారని పెద్ద ఎత్తున తమిళ మీడియాలో ప్రచారం సాగింది. కానీ ఊహించని విధంగా టికెట్ ను దక్కించుకున్నాడు ఉదయనిధి స్టాలిన్. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో ఉదయనిధి తాత, దివంగత కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానంలో ఉదయనిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. మూడేళ్ల క్రితమే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం తొలి నుంచి డీఎంకేకు కంచుకోటగా ఉంది. ఉదయనిధి ప్రస్తుతం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గతంలో కరుణానిధి ఇక్కడి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్టాలిన్ కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.173 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను స్టాలిన్ ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పోటీగా తంగా తమిళ్ సెల్వన్ ను ఆయన బరిలోకి దించారు. మార్చి 15వ తేదీన నామినేషన్లు వేయనుండగా.. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తామని స్టాలిన్ తెలిపారు.