శివసేన తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేల మధ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శివసేన సైనికులను వీధుల్లోకి వదులుతామని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయరని.. శివసేన చివరి వరకు పోరాడుతుందని ఆయన అన్నారు.
సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. "ఇది శివసేనసైనికుల ఆగ్రహం. ఒక్కసారి వెలిగించిన మంట ఆరిపోదు. శివసేన చివరి వరకు పోరాడుతుంది," అని అన్నారు.
ఇదిలావుంటే.. అస్సాంలోని గౌహతిలోని ఓ హోటల్‌లో క్యాంప్ లో ఉన్న పార్టీ రెబల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ పూణే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు శనివారం ధ్వంసం చేశారు.
ఈ నేఫథ్యంలోనే ఏక్నాథ్ షిండే.. అతని శిబిరం తిరిగి వచ్చి ముంబైలో పార్టీని ఎదుర్కోవాలని సంజయ్ రౌత్ సవాలు విసిరారు.
తాజాగా ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు ఇతర ఎమ్మెల్యేల భద్రతను రద్దు చేసిందని ఆరోపిస్తూ లేఖ రాశారు. అయితే ఈ వాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.