వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు చిన్నారులు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని మనోహర్ పార్క్ ప్రాంతంలో ఎల్‌పిజి సిలిండర్ పేలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గాయపడ్డారు.
By అంజి
వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు చిన్నారులు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని మనోహర్ పార్క్ ప్రాంతంలో ఎల్‌పిజి సిలిండర్ పేలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గాయపడ్డారు. ఆదివారం రాత్రి 8:20 గంటల ప్రాంతంలో వజీర్‌పూర్‌లోని అశోక్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది. అత్యవసర కాల్ అందిన వెంటనే, రెండు అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక దళం మంటలను అదుపు చేయగలిగింది, కానీ ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. 12 ఏళ్ల సాక్షి, 9 ఏళ్ల ఆకాష్ మరణించారని ప్రకటించారు.
పిల్లల తల్లి సవిత మాట్లాడుతూ, తాను వంట చేస్తుండగా, వంటగది దగ్గర వేలాడుతున్న బట్టలకు మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో తన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు గదిలో ఉన్నారని చెప్పారు. సవిత, ఆమె కుమార్తెలలో ఒకరైన మీనాక్షి సురక్షితంగా బయటపడగా, ఆమె పెద్ద కుమార్తె సాక్షి, కుమారుడు ఆకాష్ మంటల్లో చిక్కుకున్నారు. సవిత సహాయం కోసం పిలిచినప్పుడు, ఇంటి యజమాని కుమారుడు, ఇతర అద్దెదారులు ఇద్దరు పిల్లలను బయటకు తీశారు.
అయితే, ఇద్దరు పిల్లలకు తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. వారిని మోతీ నగర్‌లోని ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు వారు 100 శాతం కాలిన గాయాలతో మరణించారని ప్రకటించారు. మూడవ బాధితుడు సందీప్ పాఠక్ గా గుర్తించబడ్డాడు, అతనికి ఐదు శాతం కాలిన గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో నిల్వ ఉంచిన ఎల్‌పిజి సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.