కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగడం సంచలనంగా మారింది. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప, దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను నియమించింది. రూప కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పని చేస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారిణి డి భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతానికి రూపకు, రోహిణి సింధూరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.