నోయిడాలోని సెక్టార్ 70లో 'చోలే భాతురే', 'కుల్చే' విక్రయించే స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఉపేంద్ర (22), శివమ్ (23) అనే ఇద్దరు స్నేహితులు కార్బన్ మోనాక్సైడ్‌ని పీల్చి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్థరాత్రి వారు అద్దెకు ఉంటున్న గదిలో మరుసటి రోజు వ్యాపారానికి సన్నాహకంగా శనగలను ఓ పాత్రలో పోసి గ్యాస్ స్టవ్ మీద ఉడకబెట్టారు. ఈ క్రమంలోనే గ్యాస్ ఆఫ్ చేయకుండానే నిద్రలోకి జారుకున్నారు. గది తలుపులు మూసివేయడంతో వారు కార్బన్‌మోనాక్సైడ్‌ని పీల్చి నిద్రలోనే కన్నుమూశారు. ఈ సంఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగింది.
నోయిడా సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు నిద్రపోయే ముందు గది తలుపులు, కిటికీలు మూసివేశారు. రాత్రి సమయంలో శనగలను ఉడకబెట్టేందుకు స్టవ్ ఆన్ చేసి నిద్రలోకి వెళ్లారు. దీంతో హానికరమైన పొగలు మూసివున్న ప్రదేశంలో నిండిపోయాయి. ఇది కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు కారణమైంది, అయితే ఆక్సిజన్ స్థాయిలు క్షీణించాయి, ఇది ఊపిరాడకపోవటం వలన వారి మరణాలకు దారితీసింది. విషపూరిత పొగ కారణంగా ఇద్దరికీ ఆక్సిజన్ అందకుండా పోయిందని రాజీవ్ గుప్తా వివరించారు.
గదిలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి, ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారని గమనించారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వారి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు నిర్ధారించారు. స్టవ్‌లు, ఓవెన్‌లు, జనరేటర్‌లు, వాహనాల్లో ఇంధనాలను కాల్చినప్పుడు రంగులేని, వాసన లేని విష వాయువు కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గట్టిగా మూసివేసిన ప్రదేశాలలో, ఈ వాయువు యొక్క గాఢత వేగంగా పెరుగుతుంది, ఇది ప్రాణాంతక ప్రమాదాన్ని కలిగిస్తుంది.