రైతు ఉద్యమంలో కీలక పరిణామం.. రెండు సంఘాలు వెన‌క్కి..!

Two farmer unions break away from farmers protest.రైతుల ఉద్యమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళ‌న‌ల నుంచి రెండు రైతు సంఘాలు వైదొలిగాయి.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 27 Jan 2021 7:00 PM IST

Two farmer unions break away from farmers protest

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నిన్న దేశ రాజ‌ధానిలో రైతులు ట్రాక్ట‌ర్ ర్యాలీని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ర్యాలీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. దీంతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళ‌న‌ల నుంచి రెండు రైతు సంఘాలు వైదొలిగాయి. ఆందోళ‌న‌ల నుంచి రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (ఆర్‌కేఎంఎస్), భారతీయ కిసాన్ యూనియన్ (భాను) వైదొలుగుతున్న‌ట్లు ప్రకటించాయి.

ఆర్‌కేఎంఎస్ కన్వీనర్ సర్దార్ వీఎం సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే నాడు రాజధానిలో జరిగిన సంఘటనలు బాధించాయన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమని పేర్కొన్నారు. కొన్ని సంఘాలు ఇత‌రులు చెప్పిన‌ట్లే ప‌నిచేస్తున్నాయ‌ని వీఎం సింగ్ ఆరోపించారు. నిన్న‌టి ఘ‌ట‌న‌లు త‌మ‌ను తీవ్రంగా బాధించాయ‌ని పేర్కొన్నారు. రాకేశ్ తికాయ‌త్ వంటి నేత‌ల వైఖ‌రితోనే ఉద్రిక్త‌త నెల‌కొంద‌న్నారు. అనుకున్న స‌మ‌యానికి కంటే ముందుగానే ర్యాలీ నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఉద్రిక్త‌త‌లు త‌లెత్తిన‌ట్లు చెప్పారు. ఇతర మార్గాల్లో ర్యాలీని ఎందుకు తీసుకెళ్లారని వీఎం సింగ్ మండిపడ్డారు.

ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం పూర్వీకుల త్యాగఫలమని.. దానిపై నిన్న జెండా ఎగురవేసి ఏం సాధించామని ప్రశ్నించారు. తాము ఉద్యమం నుంచి తప్పుకోవడానికి నిన్నటి ఘటనే కారణమని స్పష్టం చేశారు. తామిక్కడకు దెబ్బలు తినేందుకు, చనిపోయేందుకు రాలేదని, హక్కులు సాధించుకునేందుకే వచ్చామన్నారు. రైతు హ‌క్క‌ల కోసం, మ‌ద్ద‌తు ధ‌ర సాధ‌న కోసం త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నిన్నటి ఘటనలు తమను బాధించాయని.. అందుకనే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.


Next Story