ఇటీవల కాలంలో భారత ప్రభుత్వంతో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్ మరోసారి బరితెగించి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ట్విటర్లోని ట్వీప్ లైఫ్ సెక్షన్‌లో జమ్ముకాశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా పేర్కొంది. దీన్ని ఓ నెటిజన్ గుర్తించడంతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై నెటిజన్లు ట్విట్టర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
కాగా.. గతంలో ట్విట్టర్ లేహ్ ను చైనాకు చెందిన భూభాగం అని చూపించడం తెలిసిందే. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే చేసింది. నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దాంతో థర్డ్ పార్టీ అన్న రక్షణ ట్విటర్ కోల్పోయింది. దీంతో ట్విటర్‌పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం భారత్ ప్రభుత్వం వర్సెస్ ట్విటర్‌గా మారిపోయింది పరిస్థితి.