భారత్ లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నా కూడా వాటికి కాస్త మసాలా అద్ది.. వైరల్ చేస్తూ ఉండడం కొందరి పని..! ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటివి పెద్ద ప్రభావమే చూపిస్తాయి. ఇంకొన్ని సార్లు నిజమైన విషయాలను తొక్కేయాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే అలాంటి ఖాతాలపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేస్తున్నా.. వాటిపై కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చూస్తూ ఉంటారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు 250 నకిలీ ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది. రైతు నిరసనల నేపథ్యంలో... 'రైతుల వధకు మోదీ పన్నాగం' అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ ఈ నకిలీ ట్విట్టర్ ఖాతాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. జనవరి 30న ఈ ఫేక్ అకౌంట్ల నుంచి రెచ్చగొట్టే, బెదిరించే రీతిలో ట్వీట్లు వచ్చాయని కేంద్రం ట్విట్టర్ కు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే అప్రమత్తమైన ట్విట్టర్ నకిలీ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసింది.
ఏ ప్రాంతంలోనైనా అధికార యంత్రాంగం నుంచి ఫిర్యాదులు వస్తే అభ్యంతరకరమైన కంటెంట్ ను నిలుపుదల చేయడం తప్పనిసరి అని ట్విట్టర్ చెబుతోంది.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడంలో పారదర్శకత ఎంతో కీలకం అని ట్విట్టర్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇటీవల రైతుల ధర్నా జరిగిన సమయంలో పాకిస్థాన్ కూడా భారత్ మీద విషం చిమ్మడానికి ప్రయత్నించిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. కొన్ని వందల ట్విట్టర్ ఖాతాలు పాకిస్థాన్ నుండి ఆపరేట్ అవ్వడం మొదలైందని.. భారత ప్రభుత్వం కూడా దీన్ని ఓ కంట కనిపెడుతూ ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు అలాంటి ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది.