రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు కొత్త పేర్లు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ఈ గ్రామాలకు పెట్టాలని నిర్ణయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పేరు మార్చే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎనిమిది జిల్లాల్లోని 75 గ్రామాల పేర్లను మార్చనున్నట్లు సమాచార, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి పీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఈ గ్రామాలను గుర్తించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని స్వాతంత్య్ర సమరయోధుల జాబితాను, దేశ స్వాతంత్య్ర పోరాటానికి వారు చేసిన కృషిని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఏర్పాటు, నామకరణం చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం సన్మానించనున్నట్లు తెలిపారు. నామకరణం, మారథాన్, సైకిల్ ర్యాలీ, క్రాంతివీర్ సంగీత సమరోహ్, సిట్ అండ్ డ్రా, స్వాతంత్య్ర సమరయోధుల జీవితం, కృషిపై పాటలు, నాటికలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మొత్తం 75 గ్రామాలను రోడ్డు మార్గంలో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.