అతిథిలా పెళ్లికి వచ్చి.. వధూవరులపై కేసు బుక్ చేసి..

Tripura DM Raids Two Wedding Venues.రెండు కల్యాణ మంటపాల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న శైలేష్ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా వెళ్లారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 7:03 AM GMT
Tripura DM

ఏ ధైర్యం తో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారో గానీ.. ఆ జంటలు మూడు ముళ్ళు వేసుకుని, ఏడడుగులు నడిచిన లోపే పోలీస్ కేసులు పడ్డాయి. కరోనా కాలంలో కూడా హంగూ ఆర్భాటం తో పెళ్లి వేడుక చేసుకున్నందుకు గాను వారు కటాకటాలు లెక్కించాల్సి వచ్చింది. కరోనా భూతం జడలు విప్పి నాట్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుమికూడడంపై ఎక్కడిక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. పరిమిత సంఖ్యలో ప్రజలతోనే వేడుకలు జరపుకోవాలని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎవరు ఎంత మొత్తుకుంటున్నా నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు జరిగుతూనే ఉన్నాయి. అయితే వెస్ట్ త్రిపుర మేజిస్ట్రేట్ శైలేష్ యాదవ్ అనే ఐఏఎస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే ఉన్నతాదాయ వర్గాలు పెళ్లివేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహం నడుమ జరుపుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు కల్యాణ మంటపాల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న శైలేష్ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా వెళ్లారు. అక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో సిబ్బంది సాయంతో చర్యలు తీసుకున్నారు. వధూవరులపైనా, పెళ్లి నిర్వాహకులపైనా కేసులు నమోదు చేశారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదంటూ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. పెళ్లిళ్లకు వేదికగా నిలిచిన రెండు కల్యాణ మంటపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద రెండేళ్ల పాటు నిషేధం విధించారు. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు తదితరులపై కేసులు నమోదు చేశారు. కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

అయితే ఐఏఎస్ అయినంత మాత్రాన సామాన్య ప్రజల మీద చేయి చేసుకునే హక్కు, వారితో మౌఖికంగా దుర్భాషలాడే హక్కు లేదంటూ ఇప్పుడు మరో వాదం మీదలయ్యింది. శైలేష్ యాదవ్ ఓవరాక్షన్కు బ్రేక్ చెప్పాలని, అతన్ని సస్పెండ్ చేయాలంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే వారిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం లేదని, నియమాలు ఉల్లాంఘించినందువల్లే తాను కాస్త గట్టిగా మాట్లాడవలసి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. ఏది ఏమైన కరోనా నియమాలను వివాహం చేస్తున్న కుటుంబాలు ఉల్లంఘించారు అన్నది మాత్రం నిజం. ఎందుకంటే త్రిపురలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.

Next Story
Share it