ఎంపీని బహిరంగంగా తిట్టేసిన మమతా బెనర్జీ
Trinamool's Mahua Moitra Trends For Rebuke, In Video, By Mamata Banerjee. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత
By Medi Samrat Published on 10 Dec 2021 8:06 PM IST
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపీపై ఫైర్ అయ్యారు. బహిరంగంగానే ఆమె వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఎంపీ మహువా మోయిత్రాకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నదియా జిల్లాలో తృణమూల్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నేతలకు మమత గట్టి హెచ్చరిక జారీ చేశారు. నదియా జిల్లాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ పార్టీ నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు. కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మహువా మోయిత్రా ముఖ్యమంత్రితో కలిసి వేదికపై ఉన్నారు.
"మహూవా, ఇక్కడ నేను స్పష్టమైన సందేశం ఇస్తాను. ఎవరు ఎవరికి వ్యతిరేకంగా ఉంటారో నేను చూడాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడకపోతే, అతను లేదా ఆమె యూట్యూబ్‌లో లేదా వార్తాపత్రికలలో కొన్ని వార్తలు పెడతారు. ఇలాంటి రాజకీయాలు బాగుండవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి" అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. "ఎన్నికలు వచ్చినప్పుడు, ఎవరు పోటీ చేయాలో, ఎవరు పోటీ చేయకూడదో పార్టీ నిర్ణయిస్తుంది. అభిప్రాయ భేదాలు ఉండకూడదు. నేను మీకు చెప్తున్నాను, అందరూ కలిసి పని చేయాలని," ఆమె అన్నారు. మహువా.. ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు.