భోపాల్ విషాదం: 40 ఏళ్ల తర్వాత కఠిన ప్రక్రియతో విష వ్యర్థాల అంతం
భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పడి ఉన్న 40 ఏళ్ల నాటి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పీథమ్‌పూర్‌కు తరలించింది.
By అంజి Published on 2 Jan 2025 11:33 AM ISTభోపాల్ విషాదం: 40 ఏళ్ల తర్వాత కఠిన ప్రక్రియతో విష వ్యర్థాల అంతం
కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పడి ఉన్న 40 ఏళ్ల నాటి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పీథమ్‌పూర్‌కు తరలించింది. బుధవారం రాత్రి బయలుదేరిన 12 సీల్డ్ కంటెయినర్ల కోసం గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేసింది. 30 నిమిషాల షిప్ట్‌లో 100 మందిఈ వ్యర్థాలను ప్యాక్ చేశారు. ప్రతి అరగంటకు వారి హెల్త్‌ను చెక్ చేసి రెస్ట్ ఇచ్చారు. ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డారు.
“వ్యర్థాలను తీసుకెళ్ళే పన్నెండు కంటైనర్ ట్రక్కులు రాత్రి 9 గంటల ప్రాంతంలో నాన్ స్టాప్ ప్రయాణంలో ఉన్నాయి. ధార్ జిల్లాలోని పితాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి ఏడు గంటల్లో చేరుకునే వాహనాల కోసం గ్రీన్ కారిడార్ సృష్టించబడింది, ”అని భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ అన్నారు.
పీథమ్‌పూర్ యూనిట్‌కు చేరుకున్న భోపాల్ విష వ్యర్థాల దహనానికి అన్నీ అనుకూలిస్తే 3 నుంచి 9 నెలలు పడుతుంది. ఇందుకోసం 9 లేయర్ల చిమ్నీ వాడతారు. ప్రతి లేయర్‌లో వ్యర్థాలు ఫిల్టర్ అయ్యి గాల్లో కలుస్తాయి. బూడిదలోనూ ఎలాంటి విష పదార్థాలు లేవని నిర్ధారించాకే నీరు, గాలి, నేల కలుషితమవ్వని చోట పూడ్చేస్తారు. 2015లో దీనిపై ఓ పైలట్ ప్రాజెక్టు చేశారు.
డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుండి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ (MIC) గ్యాస్ లీకైంది, కనీసం 5,479 మంది మరణించారు మరియు వేలాది మంది తీవ్రమైన మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. ఇది ప్రపంచంలోని చెత్త పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది.