నోట్ల కట్టలు బయటకు తీసుకెళ్లినట్లు చూపించలేదు, పూర్తిగా అబద్ధం: జస్టిస్ యశ్వంత్ వర్మ
25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అం
By Knakam Karthik
నోట్ల కట్టలు బయటకు తీసుకెళ్లినట్లు చూపించలేదు, పూర్తిగా అబద్ధం: జస్టిస్ యశ్వంత్ వర్మ
ఢిల్లీ హైకోర్టు జడ్డి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనర్ అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా శనివారం రాత్రి తన వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలూ ఉన్నాయి. అగ్ని మాపకశాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది.
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తెలిపినా శనివారం బయటకు వచ్చింది.
త్రిసభ్య సంఘంతో విచారణ..
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు.