తృణ‌మూల్ కాంగ్రెస్‌కు హ్యాక‌ర్ల షాక్‌.. ట్విట‌ర్ ఖాతా హ్యాక్‌

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట‌ర్ ఖాతా హాక్ అయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 5:09 AM GMT
తృణ‌మూల్ కాంగ్రెస్‌కు హ్యాక‌ర్ల షాక్‌.. ట్విట‌ర్ ఖాతా హ్యాక్‌

ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట‌ర్ ఖాతా హాక్ అయింది. పార్టీ అకౌంట్ పేరుతో పాటు లోగోను మార్చివేశారు హ్యాక‌ర్లు. ప్రొపైల్ నేమ్‌ను యుగా ల్యాబ్స్ గా మార్చారు. ప్రొపైల్ ఫోటో వై ఎల్ ఆకారంలో క‌నిపిస్తోంది. ఖాతా పేరు కింద మాత్రం ఏఐటీసీ (ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్-AITC‌) పేరును అలాగే ఉంచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్టులు మాత్రం చేయ‌లేదు. అయితే.. నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌కు సంబంధించిన ట్వీట్ల‌కు మాత్రం ఈ ఖాతా నుంచి స‌మాధానాలు వెళ్లాయి. దీనిపై తృణ‌మూల్ పార్టీ స్పందించింది. "మా పార్టీ ట్విట‌ర్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై మేం ట్విట‌ర్ ప్ర‌తినిధుల‌కు స‌మాచారం అందించాం. వారు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు." అని పార్టీ నేత డెరెక్ ఓబ్రీన్ తెలిపారు.

యూగా ల్యాబ్స్‌ అనేది అమెరికాకు చెందిన ఓ ప్రముఖ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సంస్థ. ఇది ఎన్‌ఎఫ్‌టీలు, డిజిటల్‌ కలెక్టిబుల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా క్రిప్టోకరెన్సీ, డిజిటల్ మీడియాలో కూడా సంస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

కాగా.. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ ట్వీట‌ర్ అకౌంట్‌ను దుండ‌గులు హ్యాక్ చేశారు. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను మార్చేశారు. NFT Millionarie పేరుతో వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. ఖాతా పేరు కింద మాత్రం Ysr Coongress Party పేరును అలాగే ఉంచారు. కొత్త ట్వీట్లు పోస్ట్‌ చేశారు. అంతకుముందు అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైంది.

ఏప్రిల్ 2022లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది.

Next Story