ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తిరథ్ సింగ్ రావత్
Tirath Singh Rawat To Be New Uttarakhand Chief Minister. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయడంతో
By Medi Samrat Published on 10 March 2021 11:50 AM IST
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. త్రివేంద్రసింగ్ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం కుర్చీని బీజేపీ ఎంపీ తిరథ్ సింగ్ రావత్ దక్కించుకున్నారు. ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం ఉదయం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలావుంటే.. తిరథ్ సింగ్ రావత్ 2013-15 వరకూ ఉత్తరాఖండ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే.. సీఎం పదవికి కేంద్ర పెట్రోలియం మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్ తదితరుల పేర్లను అధిస్టానం పరిశీలించింది. చర్చల అనంతరం సీఎం పదవిని తిరథ్‌కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మంగళవారం డెహ్రాడూన్‌లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో రావత్ వైదొలిగారు. త్రివేంద్రసింగ్ రావత్‌పై అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై అసమ్మతి ప్రకటించడంతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్‌సింగ్, ఉత్తరాఖండ్ ఇన్‌చార్జి దుష్యంత్ గౌతమ్‌లతో కూడిన కమిటీ.. ఆ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. సీఎంను మారుస్తామన్న హామీతో వారిని శాంతింపజేసింది. ఈ పేఫథ్యంలోనే ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసి వచ్చిన అనంతరం రావత్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ బేబిరాణి మౌర్యకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.