దారుణం.. స్కూల్‌ డ్రైనేజీలో మూడేళ్ల బాలుడి మృతదేహం

బీహార్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  17 May 2024 12:46 PM IST
three years old boy, dead,  bihar, school,

దారుణం.. స్కూల్‌ డ్రైనేజీలో మూడేళ్ల బాలుడి మృతదేహం

బీహార్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌కి చెందిన డ్రైనేజీలో ఓ మూడేళ్ల బాలుడి శవం లభ్యం అయ్యింది. దాంతో.. తల్లిదండ్రులు సదురు స్కూల్‌ యాజమాన్యంపై మండిపడుతూ.. ఆందోళనలకు దిగారు. పాఠశాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. స్కూల్‌ వైపు వెళ్లే రోడ్లన్నంటినీ నిర్బంధించారు. పలు వాహనాలకు నిప్పంటించారు. వారి ఆందోళనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

బీహార్‌లోని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్లిన మూడేళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో.. తల్లిదండ్రులు కంగారుపడి స్కూల్‌కి వెళ్లారు. తమ కుమారుడి గురించి ఆరా తీశారు. కానీ.. లాభం లేకపోయింది. యాజమాన్యాన్ని నిలదీసి అడిగితే తమకు తెలియదనే సమాచారం ఇచ్చారు. పొంతన లేని యాజమాన్యం సమాధానాలు విన్న బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టుపక్కల గాలించారు. స్కూల్‌ ఆవరణలో ఒక లోతైన డ్రైనేజీ గుంత ఉంది.. అందులోనే మూడేళ్ల బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని.. బంధువులతో కలిసి స్కూల్‌ భవనానికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనలు చేశారు.

ఈ ఆందోళనల గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతపరిచారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. చిన్నారి స్కూల్‌లోకి వెళ్తున్న వీడియో ఉంది కానీ.. బాలుడు బయటకు వచ్చినట్లు కనిపంచలేదు. దాంతో.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హత్య కింద కేసు నమోదు చేశామయన్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామనీ.. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story