ముఖ్యమంత్రిని చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్
Threat to kill Punjab CM. పంజాబ్ లో ముఖ్యమంత్రిని చంపితే పది లక్షలిస్తామంటూ వేలసిన పోస్టర్.
By Medi Samrat Published on 3 Jan 2021 7:54 AM GMTమామూలుగా అయితే ఉగ్రవాదుల ఆచూకీ చెబితే బహుమానం ఇస్తామంటూ పోలీసులు ప్రకటించడం చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి సీఎంపై రివార్డు ప్రకటించాడు. ముఖ్యమంత్రిని చంపేస్తే.. ఏకంగా మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానంటూ వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను చంపిన వాళ్ళకు బహుమానం ఇస్తామంటూ వెలసిన పోస్టర్లు పంజాబులో సంచలనంగా మారింది. పంజాబు మొహాలి సెక్టార్ లోని 66-67 గైడ్ మ్యాప్ ప్రాంతంలో వెలసిన పోస్టర్లను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. డీ గ్యాంగ్ పేరుతో కనిపించిన పోస్టర్లు ఒక్కసారిగా కలకలం రేపాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టర్లో కనిపించిన ఈ మెయిల్ ప్రకారం నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎంను బెదిరిస్తూ పోస్టర్ వేసిన అగంతుకునిపై ఐపీసీ సెక్షన్ 504,506,120బి కింద, పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్‌మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మొహాలీ సిటీ ఎస్పీ తెలిపారు. కాగా.. డిసెంబర్ 31న ఈ పోస్టర్ వెలిసింది. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు
ఓ వైపు పంజాబ్ రైతుల ఆధ్వర్యంలో ఢిల్లీ శివారు ప్రాంతంలో మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో సీఎం చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో సీఎంకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవటంతో రాజకీయంగా సంచలనంగా మారింది.