ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌.. అక్టోబ‌రులో తార‌స్థాయికి..!

Third Wave of Corona May Hit India This Month.భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం అంతా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2021 8:44 AM IST
ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌.. అక్టోబ‌రులో తార‌స్థాయికి..!

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్‌లో పెద్ద ఎత్తున కేసులు న‌మోదు అవ్వ‌డంతో పాటు భారీగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దీని నుంచి కోలుకోక ముందే మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న సంగ‌తి తెలిసిందే. దేశంలో ఈనెల‌లోనే మూడో ముప్పు మొద‌లుకానుంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఆగ‌స్టు రెండో వారం నుంచి కొత్త పాజిటివ్ కేసులు పెర‌గ‌డం ప్రారంభ‌మై.. క్ర‌మంగా పెరుగుతూ అక్టోబ‌రులో గ‌రిష్ట‌స్థాయికి చేరుకోవ‌చ్చున‌ని నిపుణులు చెబుతున్నారు.

కాగా.. గ‌తంలో రెండో ఉద్దృతిపైనా వీరు క‌చ్చిత‌మైన లెక్క‌లు క‌ట్ట‌డం ఇక్కడ గ‌మ‌నార్హం. విద్యాసాగ‌ర్(హైద‌రాబాద్ ఐఐటీ), మ‌ణింద్ర అగ‌ర్వాల్‌(కాన్పుర్ ఐఐటీ) నేతృత్వంలోని ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌యాన్ని చేశారు. కాగా.. సెకండ్ వేవ్ లాగా మూడో వేవ్ మాత్రం పెద్ద విపత్తు అయ్యే అవకాశం లేదని, కరోనా పీక్ స్టేజ్‌ పరిస్థితుల్లో కూడా, రెండవ వేవ్‌తో పోలిస్తే ప్రతిరోజూ నాలుగింట ఒక వంతు కేసులు మాత్రమే నమోదవుతాయని చెబుతున్నారు. ప‌రిస్తితులు మ‌రింత దిగ‌జారితే.. రోజుకు పాజిటివ్ కేసులు 1.5ల‌క్ష‌ల‌కు చేర్చొచ్చున‌ని అంచ‌నా వేశారు. కాగా.. క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదు అయ్యే కేర‌ళ‌, మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రాలు ప‌రిస్థితిని అక‌స్మాత్తుగా మార్చేయవ‌చ్చునన్నారు.

వ్యాక్సినేషన్ రెండు డోసులను వేగవంతం చేయడం, అభివృద్ధి చెందుతున్న హాట్‌స్పాట్‌లను ముందుగా గుర్తించడంపై దృష్టి పెడితే ప్రమాదం త్వరగా అంచనా వెయ్యొచ్చని చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కరోనా వైరస్ కొత్త వేరియంట్‌లను పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు. ఎందుకంటే డెల్టా వంటి కొత్త వేరియంట్ వస్తే, రెండవ వేవ్‌లో కనిపించే విధంగా పరిస్థితి దిగజారిపోతుంది. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్ర‌స్తుతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అవుతుండ‌డంతో.. తిరిగి అన్ని కార్య‌క‌లాపాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో అల‌స‌త్వ‌మూ పెరుగుతుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మహమ్మారి మొదటి వేవ్ ప్రభావాలు ముగిసిన వెంటనే ఇదే వైఖరి గమనించారని, ఆ తర్వాత సెకండ్ వేవ్ ఎటువంటి విధ్వంసానికి కారణమైందో చూశామని, ఇప్పుడు కూడా ప్రజలు, ప్రభుత్వాలు అదే వైఖరి ప్రదర్శిస్తే ప్రమాదంలో సమాజం పడుతుందని అంటున్నారు.

Next Story