కుల గణనలో తప్పేమీ లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కుల గణనకు మద్దతు పలికారు.

By Kalasani Durgapraveen  Published on  11 Oct 2024 12:04 PM IST
కుల గణనలో తప్పేమీ లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కుల గణనకు మద్దతు పలికారు. కుల గణన నిర్వహించడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. కుల గణనను సమర్థించినప్పటికీ పేదరికమే అతిపెద్ద సమస్య అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మీరు బలహీన వర్గానికి చెందినవారైనా, మీ దగ్గర డబ్బున్నా సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు అగ్రకులానికి చెందినవారైతే.. డబ్బు లేకపోతే, మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. సంపద అనేది పెద్ద లెవెల్లర్. అక్కడే మీరు సమతుల్యతను కనుగొనాలన్నారు.

కుల గణన అంశాన్ని మొదట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లేవనెత్తారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కుల గణన ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని తీసుకురాగా.. దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహించాలని రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ది కోసం కులాన్ని వాడుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ముస్లింల కులాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం లేదని, కేవలం హిందువులను మాత్రమే విడగొట్టాలనుకుంటోందని ఆయన అన్నారు.

హిందువుల్లోని ఒక కులం మరో కులంపై పోరాడేలా చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. హిందువులు ఎంతగా చీలిపోతే అంత లాభం చేకూరుతుందని కాంగ్రెస్ కు తెలుసు అన్నారు. హిందూ సమాజాన్ని ఎలాగైనా అగ్నికి ఆహుతి చేయాలని.. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. భారత్ లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఈ ఫార్ములాను వర్తింపజేస్తుందన్నారు.

ప్రతిపక్షాలే కాదు.. కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా కుల సర్వేకు మద్దతు పలికాయి. కేంద్రమంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు చిరాగ్ పవస్న్, అనుప్రియా పటేల్ కూడా మద్దతు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లోక్సభ ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి కుల గణన చేయాలని అన్నారు. ప్రతి సామాజికవర్గం తమ సంఖ్య పెరిగిందని చెబుతోందని.. కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి సర్వే చేయాలని ఆయన అన్నారు.

Next Story