కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బంది పట్ల ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. అంతేకాకుండా వారిని పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పాములను పట్టి ఆడించే ఓ మహిళా ఇంటికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లారు. వ్యాక్సిన్ వేసుకోవాలని మహిళా కమలాదేవికి వైద్య సిబ్బంది నచ్చజెప్పారు.
అయితే ఆమె ఎంతకు వినకపోగా బుట్టలో ఉన్న పామును తీసి వైద్య సిబ్బందిని బెదిరించింది. ఇక్కడి నుంచి వెళ్లకపోతే పామును విసురుతానని మహిళ హెచ్చరించింది. స్థానికుల ద్వారా వైద్య సిబ్బంది ఆమెకు నచ్చ జెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే లాభాలను ఆమెకు వివరించారు. దీంతో ఆ మహిళా చివరకు వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ గ్రామంలో వ్యాక్సిన్ తీసుకోని వారికి కూడా వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేశారు.