యూపీలోని హమీర్‌పుర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. పెళ్లి జరిగిన తర్వాత రోజే భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే భర్త ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో తనను, తన బిడ్డను వదిలేసి భర్త పారిపోయాడంటూ.. సదరు మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్ కొత్వాలి పట్టణానికి చెందిన బాధితురాలిని ఓ వ్యక్తి ప్రేమ పేరుతో నయవంచన చేశాడు. ఏడాది కాలంగా శారీరకంగా వాడుకుని వదిలేశాడు.
ఆ వ్యక్తి పెళ్లి సాకుతో బాలికపై శారీరకంగా వేధించాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. తనను మోసం చేశాడని సెప్టెంబర్ 13న ఆ వ్యక్తిపై యువతి ఫిర్యాదు చేసింది. అప్పటికి యువతి ఎనిమిది నెలల గర్భిణి. దీంతో పోలీసులు యువతి ప్రియుడిని స్టేషన్‌కు పిలిపించి పెళ్లికి ఒప్పించారు. సెప్టెంబర్ 28న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్దిసేపటికే యువతికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలోనే భర్త.. భార్యను, బిడ్డను ఆసుపత్రిలో వదిలి పారిపోయాడు. బాలిక, బిడ్డ పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఆమెను హమీర్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మళ్లీ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఫిర్యాదు ఆధారంగా మహిళ భర్తను విచారించినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. శిశువు చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు భర్త అంగీకరించాడు. దీంతో యువతితో కొత్వాలి పోలీసులు మాట్లాడి కేసును సాల్వ్ చేశారు.