స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణం
కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థి ఆరోపణలు చేసింది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 6:08 AM GMTకోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థి ఆరోపణలు చేసింది. టీచర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. విద్యార్థినిలను ఇలా వేధింపులకు గురిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో తమనూ ఇలానే వేధించాడంటూ మరికొందరు విద్యార్థినిలు ఆరోపించారు.
నిందితుడు సమీర్‌రాయ్‌పై గతంలోనూ పలుమార్లు తాను కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత విద్యార్థిని ఆరోపించింది. దీంతో ఆందోళనకు దిగినట్టు పేర్కొంది. నిందితుడికి వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తాజాగా స్పందించిన ప్రిన్సిపాల్ మధుమంజరి మండల్ నిందితుడిని సస్పెండ్ చేశారు. నిందితుడిపై తదుపరి చర్యలు ఉంటాయని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
నిందితుడు లైంగికంగా తనకు సహకరిస్తే చదువులో సాయం చేస్తానని బాధితురాలికి మెసేజ్‌లు చేశాడు. చదివిన తర్వాత వాటిని డిలీట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమెను దుస్తులు విప్పాలని, అవి చూపించాలని కూడా కోరాడు.
ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లు బయటకు వచ్చాయి. అతడి మెసేజ్‌లకు బాధిత విద్యార్థిని.. మీ భార్య ఏం చేస్తుందని అడిగింది. అందుకు ఆయన సమాధానం ఇవ్వకుండా 'నువ్వు నాకు కావాలి' అని సమాధానం ఇచ్చాడు.
అంతేకాదు, 'నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?' అని కూడా అడిగాడు. అందుకామె బదులిస్తూ.. ఒక టీచర్‌గా మీరంటే తనకు ఇష్టమేనని, మీరు మంచివారని చెప్పింది. మరో మెసేజ్‌లో లైంగికంగా తనకు సహకరిస్తే బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)లో సహకరిస్తానని కూడా నిందితుడు ఆమెకు హామీ ఇవ్వడం గమనార్హం.
మరొక స్క్రీన్‌షాట్‌లో, విద్యార్థిని తన టెక్స్ట్ సందేశాలను తన తల్లికి తెలియజేసినట్లు తెలిపింది. మా అమ్మ నన్ను ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పింది. ఇకపై చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది అని అతనితో చెప్పింది. అతను దానికి బదులిస్తూ.."నువ్వు చదువుపై దృష్టి పెట్టు, నేను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టను, నేను వాగ్దానం చేస్తున్నాను" అని బదులిచ్చాడు. అయితే విద్యార్థిని నేను అధికారులకు ఫిర్యాదు చేస్తాను దీనిపై అనడంతో అతను క్షమాపణలు కోరాడు. 2023లో అడ్మిషన్‌కు గురైనప్పటి నుంచి ఉపాధ్యాయుడు విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించింది.