భారతదేశంలో సెకండ్ వేవ్ క్షీణిస్తోందన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. మరోవైపు అమెరికా కీలక వ్యాఖ్యలు
The real Covid variant risk from India's pandemic wave is being missed. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ క్షీణిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.
By Medi Samrat Published on 12 May 2021 6:00 AM GMTభారతదేశంలో కరోనా కేసులు ఓ వైపు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. కొత్తగా 3,48,421 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 3,55,338 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,205 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,54,197కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకున్నారు. 37,04,099 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ క్షీణిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని అంటోంది. 26 రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు సుమారు 15 శాతంగా ఉందని వెల్లడించింది. మే చివరినాటికి సెకండ్ వేవ్ బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు. మూడో వేవ్ వస్తే అది చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కరోనా తొలి వేవ్ లో చిన్నారులపై కరోనా ప్రభావం 1 శాతం కంటే తక్కువ కాగా, సెకండ్ వేవ్ లో పిల్లలకు కరోనా సోకే రేటు 10 శాతానికి పెరిగింది. థర్డ్ వేవ్ నాటికి 80 శాతానికి పెరుగుతుందన్న అంచనా వేస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాలు చెందే కొద్దీ కరోనా వైరస్ మరింత శక్తిమంతంగా తయారవుతుందని భావిస్తూ ఉన్నారు.
భారత్ లోని పరిస్థితులపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కేర్ లెస్ నెస్ కారణంగానే భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగిపోయాయని చెబుతూ ఉన్నారు. కరోనా కట్టడి అయిపోయిందని భావించి.. వ్యవస్థలను ముందుగా తెరవడమే కారణమని అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు, కరోనా అంతమైపోయిందని భావించి వ్యవస్థలను యథేచ్ఛగా తెరిచేయడమే భారత్ లో కరోనా ఉధృతికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్ అనుభవం చెబుతోందని.. ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధత గురించి ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చని ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు.