ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు

దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్‌లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది

By Knakam Karthik
Published on : 31 July 2025 12:45 PM IST

National News, Maharastra, Malegaon bomb blasts case, NIA court

ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు

దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్‌లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. మాలేగావ్‌లో బైకులోనే బాంబు పెట్టినట్లు ఎన్​ఐఏ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. మాజీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు సొంత బైకు ఉన్నట్లు ఆధారాల్లేవని న్యాయస్థానం పేర్కొంది. మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాల్లేవని వివరించింది. ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, డీఎన్​ఏ నమూనాలను సేకరించలేదని తెలిపింది. నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు, కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో తీవ్రవాద నిరోధక చట్టం చేర్చడానికి వీల్లేదని, అది చెల్లదని తీర్పులో స్పష్టంచేసింది.

కాగా మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేపట్టగా.. కేసు తీవ్రత దృష్ట్యా తర్వాత ప్రభుత్వం దీనిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కు అప్పగించింది. ఈ పేలుళ్లకు సంబంధించి అప్పటి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పైనా ఆరోపణలు వచ్చాయి. ప్రజ్ఞా ఠాకూర్ కు చెందిన మోటార్ సైకిల్ కు బాంబు అమర్చారని దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. దీంతో ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ ను నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.

Next Story