పెళ్లి అయిన తర్వాత భార్య బరువు పెరిగిందని విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ వ్యక్తి. ఈ అవమానీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని బాధితురాలు నజ్మా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. నెల రోజుల క్రితమే భర్త సల్మాన్ తనను ఇంటి నుంచి గెంటేశాడని, విడాకుల పత్రాలను పంపాడని భార్య నజ్మా చెప్పింది. నజ్మాను తరచూ భర్త బాడీ షేమింగ్ చేస్తుండే వాడు. ఏడేండ్ల కొడుకు ఎదుటే ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. మీరట్‌లోని జాకీర్ కాలనీకి చెందిన నజ్మా, ఫతేపూర్‌లో నివసిస్తున్న సల్మాన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
ఈ జంటకు 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. బరువు పెరుగుతున్నానని తనను తరచు కొట్టేవాడని భార్య ఆరోపించింది. తనను లావు ఉన్నవాని పిలిచేవాడని, అతడు తనతో జీవించాలనుకోవడం లేదని నజ్మా చెప్పింది. తాను సల్మాన్‌తో కలిసి నివసించాలని కోరుకుంటున్నానని, అయితే ఆయన తన నుంచి విడాకులు కోరుతున్నాడని నజ్మా చెప్పుకొచ్చింది. ఎన్నో సార్లు భర్తకు సర్ధిచెప్పినా ఫలితం లేకపోకపోయిందని, ఈ నేపథ్యంలోనే పోలీసులను ఆశ్రయించానని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు.
న్యాయం చేయాలంటూ మీరట్‌లోని లిసారి గేట్ పోలీస్ స్టేషన్‌కు కూడా చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇంకా సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. కొత్వాలి మీరట్ సర్కిల్ ఆఫీసర్ అరవింద్ చౌరాసియా.. అలాంటి కేసు తన దృష్టికి రాలేదని చెప్పారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.