మహారాష్ట్రలోని ఓ హాస్టల్‌లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేశారనే కారణంతో నలుగురు బాలికలను ఆ హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేశారు. పూణేలో సామాజిక న్యాయ శాఖ నిర్వహించే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో 250 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హాస్టల్ లోని ఓ గదిలో నలుగురు బాలికలు ఉంటున్నారు. అందులో ఒకరు ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు.
విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ మీనాక్షి నరహరే వారిపై చర్యలకు పూనుకుంది. పిజ్జా ఆర్డర్ చేశారని తెలుసుకున్న తర్వాత, ఆ విద్యార్థినులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ నాటికి పిజ్జా ఎవరు ఆర్డర్ చేశారో చెప్పాలని డెడ్‌లైన్ పెట్టింది.
అయితే నలుగురిలో ఎవరూ చెప్పకపోయిన నెల పాటు బహిష్కరణకు గురవుతారని ఆ నోటీసుల్లె పేర్కొంది. కాగా హాస్టల్ వార్డెన్ నోటీసులను విద్యార్థినులు తిరస్కరించడంతో వారిని నెల రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వివాదానికి తోడుగా విద్యార్థినులు తల్లిదండ్రులనూ పిలిపించారు. అయితే పిల్లల చదువుకు సంబంధించిన అంశంపై కాకుండా సంబంధం లేని విషయాలపై చర్చలు జరిపారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించినా అధికారులు మాత్రం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు.