కనిపించిన నెలవంక.. నేడే రంజాన్
నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయి.
By అంజి Published on 11 April 2024 6:25 AM ISTకనిపించిన నెలవంక.. నేడే రంజాన్
నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయి. దీంతో ఇవాళ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) జరుపుకోనున్నారు. ముస్లింల పవిత్ర పండగ రంజాన్‌ను నేడు జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సభ్యులు తెలిపారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించారు గురువారం షవ్వాల్ 1వ తేదీ (ఏప్రిల్ 11)గా పరిగణించి పండుగ జరుపుకోవాలని సూచించారు. మక్కా మసీదు, మల్లేపల్లి మసీద్, తాండూరు మసీద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని తదితర ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే ఈ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
రంజాన్ అంటే..
ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెలను అరబిక్‌లో రంజాన్ అంటారు. నెలవంక దర్శనంతో ఇది మొదలవుతుంది. 29-30 రోజులు ఉండే ఈ నెలను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో ఖురాన్ పఠనానికి ప్రాధాన్యం ఇస్తారు. నెలంతా సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోజనం ముగిస్తారు. దీనినే సుహుర్/సిహ్రి అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగిస్తారు. అప్పుడు చేసే విందునే ఇఫ్తార్/ ఫితూర్ అంటారు. ఉపవాసాలను ముగించడాన్ని ఈద్ ఉల్ ఫితర్ అంటారు.