వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళకు నిమిషాల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్
Thane woman says she got 3 shots.కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఒక వేవ్ తరువాత మరో వేవ్ రూపంలో
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 3:27 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఒక వేవ్ తరువాత మరో వేవ్ రూపంలో ప్రజలను వణికిస్తోంది. ఈమహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్.. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 32కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మొన్నటికి మొన్న బీహార్‌లో ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు టీకాలు వేయగా.. తాజాగా మహారాష్ట్రలోని ఠాణెలోనూ అలాంటి ఘటననే చోటు చేసుకుంది. ఓ మహిళకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో మూడు డోసులు వేశారు.
ఓ 28ఏళ్ల మహిళ భర్తతో కలిసి గత శుక్రవారం ఆనంద్ నగర్ లోని టీకా కేంద్రానికి వెళ్లింది. వ్యాక్సినేషన్ పూర్తి అయిన తరువాత ఆమె బయటకు వచ్చి.. తనకు నర్సు మూడు సార్లు టీకా వేసిందని చెప్పింది. ఆమె భర్త మున్సిపల్ ఉద్యోగి కావడంతో.. అతడు స్థానిక కార్పొరేటర్ కు విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. అయితే, తన భర్తది ప్రభుత్వ ఉద్యోగమని, ఘటనపై కేసు పెట్టనని ఆమె చెప్పింది. తన భార్యకు వ్యాక్సినేషన్ విధానం గురించి తెలియదని ఆమె భర్త చెప్పాడు. వెంటవెంటనే మూడు డోసుల తీసుకోవడం వల్ల ఆ రోజు ఆమెకు బాగా జ్వరం వచ్చిందని, మర్నాడే తగ్గిపోయిందని వివరించాడు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందన్నాడు.
కాగా.. ఈ ఘటనపై టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తావ్డే మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని అబ్జర్వేషన్ లో పెట్టామని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని వేశామన్నారు. ఘటన నేపథ్యంలో థానే మున్సిపల్ కమిషనర్ బిపిన్ శర్మ ఆఫీసును బీజేపీ నేతలు ముట్టడించారు.