రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించిన కోర్టు
థానె కోర్టు రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 5:30 AM GMTరాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించిన కోర్టు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానె కోర్టులో షాక్ ఎదురైంది. 2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసుపై థానె కోర్టు విచారణ జరిపింది. జర్నలిస్టు హత్యతో ఆర్ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందంటూ రాహుల్‌గాంధీ సంఘ్ కార్యకర్త వివేక్‌పై ఆరోపణలు చేశారు. దాంతో స్పందించిన వివేక్ రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా వేశారు. కోర్టుకు రాహుల్‌గాంధీ ఇప్పటి వరకు తన స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో.. 881 రోజుల ఆలస్యానికి గాను థానె కోర్టు రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించింది.
కాగా.. కోర్టులో విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ తరఫున వాదనలు వినిపించిన లాయర్.. తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారనీ.. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చాలా ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. దాంతో.. రాహుల్‌గాంధీ కోర్టుకు స్టేట్‌మెంట్ ఇవ్వడంలో ఆలస్యమైందని కోర్టుకు రాహుల్ తరఫు లాయర్ చెప్పారు. ఇక ఈ వాదనలతో థానె కోర్టు ఏకీభవించింది. ఆ తర్వాత రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న మరోసారి కేసును విచారిస్తామని థానె కోర్టు వెల్లడించింది. ఈలోగా రాహుల్‌గాంధీ రాతపూర్వక స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పరువు నష్టం అభియోగాలు ఎదుర్కొంటున్నవారు ముందుగా కోర్టుకు తమ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులను ప్రశ్నించడం.. క్రాస్ క్వశ్చన్ వంటికి మొదలవుతాయి.